Karthika Puranam Day11 Adhyayam

Karthika Puranam Day11 Adhyayam Visit www.stotraveda.com
Karthika Puranam Day11 Adhyayam

Karthika Puranam Day11 Adhyayam Story

పదకొండొవ రోజు పారాయణం-కార్తీక పురాణం 11వ అధ్యాయం

Karthika Puranam 11th Day Parayanam- Karthika Puranam Day11 Adhyayam

కార్తీకపురాణం – 11వ రోజు పారాయణముమంథరుడు – పురాణ మహిమ

తిరిగి వశిష్టుడు ఇలా చెబుతున్నారు… ”ఓ జనక మహారాజా! ఈ కార్తిక మాస వ్రతం మహత్యాన్ని గురించి ఎన్నో ఉదాహరణలు చెప్పాను. ఇంకా దీని గురించి ఎంత చెప్పినా తనివి తీరదు. ఈ నెలలో విష్ణుదేవుడిని అవిసె పూలతో పూజించినట్లయితే.. చాంద్రాయణ వ్రతం చేసిన ఫలితం కలుగుతుంది. విష్ణు అర్చన తర్వాత పురాణ పఠనం చేసినా, చేయించినా, విన్నా, వినిపించినా… అలాంటి వారు వైకుంఠాన్ని పొందుతారు. దీన్ని గురించిన మరో ఇతిహాసాన్ని చెబుతాను. సావధానంగా విను… అని ఇలా చెప్పసాగారు…

పూర్వము కళింగ రాజ్యంలో మంధరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఇతరుల ఇళ్లలో వంటలు చేస్తూ, అక్కడే భోజనం చేస్తూ, మద్యమాంసాలను సేవిస్తూ… తక్కువ జాతి సాంగత్యంలో గడపసాగాడు. ఆ కారణంగా స్నాన, జప, దీపారాధనలను పాటించకుండా, దురాచారుడిగా తయారయ్యాడు. అయితే… ఆయన భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతవంతురాలు, భర్త ఎంతటి దుర్మార్గుడైనా, పతియే ప్రత్యక్ష దైవమనే ధర్మాన్ని పాటించేది. విసుగు చెందక సకల ఉపచారాలు చేసేది. పతివ్రతాధర్మాన్ని నిర్వర్తిస్తుండేది.

మంథరుడు ఇతరుల ఇళ్లలో వంటలు చేస్తూ, ఆదాయం సరిపోక వర్తకం కూడా చేయసాగాడు. అఖరికి దానివల్ల కూడా పొట్టగడవకపోవడంతో దొగతనాలు చేయడం ఆరంభించాడు. దారికాచి బాటసారుల్ని బెదిరించి, వారిదగ్గర ఉన్న ధనం, వస్తువులను అపహరించి జీవించసాగాడు.

ఒక రోజు ఒక బ్రాహ్మణుడు అడవిదారిలో పోతుండగా… అతన్ని భయపెట్టి, కొంత ధనాన్ని అపహరించాడు. ఆ సమయంలో ఇద్దరిమధ్యా ముష్టియుద్ధం జరిగింది. అంతలో అక్కడకు ఇంకో కిరాతకుడు వచ్చి, ధనాశతో వారిద్దరినీ చంపేసి, ధనాన్ని తీసుకెళ్లాడు. అంతలో అక్కడ ఒక గుహ నుంచి పులి గాండ్రించుకుంటూ కిరాతకుడిపైన పడింది. కిరాతకుడు దాన్ని కూడా వధించాడు. అయితే పులి చావడానికి ముందు పంజాతో బలంగా కొట్టిన దెబ్బ ప్రభావం వల్ల కొంతసేపటికి తీవ్ర రక్తస్రావంతో అతనుకూడా చనిపోయాడు. కొద్దిక్షణాల వ్యవధిలో చనిపోయిన బ్రాహ్మడు, మంథరుడు, కిరాతకుడు నరకానికి వెళ్లారు. హత్యల కారణంగా వారంతా నరకంలో నానావిధాలైన శిక్షలను అనుభవించారు.

మంధరుడు చనిపోయిన రోజు నుంచి అతని భార్య నిత్యం హరినామ స్మరణం చేస్తూ సదాచారవర్తినిగా భర్తను తలచుకుంటూ కాలం గడిపింది. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక రుషి రాగా… ఆమె గౌరవంగా అర్ఘ్యపాద్యాలను పూజించి ”స్వామీ! నేను దీనురాలను, నాకు భర్తగానీ, సంతతిగానీ లేదు. నేను సదా హరి నామాన్ని స్మరిస్తూ జీవిస్తున్నాను. నాకు మోక్షం లభించే మార్గం చూపండి” అని ప్రార్థించింది. ఆమె వినమ్రత, ఆచారాలకు సంతసించిన ఆ రుషి ”అమ్మా… ఈరోజు కార్తీక పౌర్ణమి. చాలా పవిత్రమైనది. ఈ రోజును వృథాచేయకు. ఈ రాత్రి దేవాలయంలో పురాణాలు చదువుతారు. నేను చమురుతీసుకుని వస్తాను. నువ్వు ప్రమిదలు, వత్తులు తీసుకుని రా. దేవాలయంలో ఈ వత్తిని తెచ్చిన ఫలితాన్ని నీవు అందుకుంటావు” అని చెప్పారు. దానికి ఆమె సంతసించి, వెంటనే దేవాలయానికి వెళ్లి శుభ్రం చేసి, గోమయంతో అలికి, ముగ్గులు పెట్టి, తానే స్వయంగా వత్తి చేసి, రెండు వత్తులు వేసి, రుషి తెచ్చిన నూనెను ప్రమిదలో పోసి, దీపారాధన చేసింది. ఆ తర్వాత ఇంటికి వెళ్లి తనకు కనిపించిన వారిని ”ఈ రోజు ఆలయంలో జరిగే పురాణ పఠనానికి తప్పకుండా రావాలి” అని ఆహ్వానించింది. ఆమె కూడా రాత్రి పురాణం విన్నది. ఆ తర్వాత కొంతకాలం విష్ణునామస్మరణతో జీవించి, మరణించింది.

ఆమె పుణ్యాత్మురాలవ్వడం వల్ల విష్ణుదూతలు వచ్చి విమానమెక్కించి వైకుంఠానికి తీసుకెళ్లారు. అయితే ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసం వల్ల కొంచెం దోషం కలిగింది. కొద్ది నిమిషాలు నరకంలో గడపాల్సి వచ్చింది. దీంతో మార్గమధ్యంలో యమలోకానికి తీసుకెళ్లారు. అక్కడ నరకంలో మరో ముగ్గురితో కలిసి బాధపడుతున్న భర్తను చూసి ఒక్క క్షణం దు:ఖించింది. విష్ణుదూతలతో ” ఓ విష్ణుదూతలారా! నా భర్త, ఆయనతోపాటు మరో ముగ్గురు నరకబాధలు అనుభవిస్తున్నారు. వారిని ఉద్దరించడమెలా?” అని కోరగా… విష్ణుదూతలు ఇలా చెబుతున్నారు.. ”అమ్మా.. నీ భర్త బ్రాహ్మణుడై కూడా స్నానసంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు. రెండోవ్యక్తి కూడా బ్రాహ్మనుడే అయినా… ధనాశతో ప్రాణమిత్రుడిని చంపి ధనం అపహరించాడు. మూడోవాడు పులిజన్మను పూర్తిచేసుకున్నవాడు కాగా… నాలుగో కిరాతకుడు. అతను అంతకు ముందు జన్మలో బ్రాహ్మణుడే” అని చెప్పారు. అతను అనేక అత్యాచారాలు చేసి, ద్వాదశిరోజున మధుమాంసాలను భక్షించి పాతకుడయ్యాడు. అందుకే వీరంతా నరకబాధలు పడుతున్నారని చెప్పారు.

విష్ణుదూతలు చెప్పినది విని ఆమె దు:ఖించి ”ఓ పుణ్యాత్ములారా! నా భర్తతోపాటు మిగతా ముగ్గురిని కూడా ఉద్దరించే మార్గముందా?” అని ప్రార్థించింది. దీంతో విష్ణుదూతలు ”అమ్మా! కార్తీక శుద్ధ పౌర్ణమినాడు నీవు వత్తి చేసిన పుణ్యఫలాన్ని ధారపోస్తే వారు నరక బాధల నుంచి విముక్తులవుతారు” అని చెప్పారు. దీంతో ఆమె అదేవిధంగా తన పుణ్యఫలాన్ని ధారపోసింది. దీంతో వారంతా ఆమెతో కలిసి మిగతా నలుగురూ వైకుంఠానికి విమానమెక్కి విష్ణుదూతలతో బయలుదేరారు.

”ఓ జనక మహారాజా! చూశావా? కార్తీకమాసంలో పురాణాలు వినడం, దీపం వెలిగించడం వంటి ఫలితాలు ఎంతటి పుణ్యాన్నిస్తాయో?” అని వశిష్టులు మహారాజుకు చెప్పారు.

ఇది స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి పదకొండొవ అధ్యాయము


పదకొండొవ రోజు పారాయణము సమాప్తము.

మూలం: స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహత్మ్యం